Quantcast
Channel: గ్రహభూమి
Viewing all articles
Browse latest Browse all 286

హ్రీంకార మహాయజ్ఞంలో పాల్గొనువారికి అవసర సారాంశం -1

$
0
0
శివశక్త్యాత్మకమైన 'హ్రీం'మంత్రాక్షరాలన్నింటికితలమానికమైనది.పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్ అంతయూ ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం 

లలితాత్రిశతి నామాలు, పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశి మంత్రం మూడు ఖండాలుగా ఉంది.  

మొదటిదైన వాగ్భవ ఖండములోని  5 బీజాలలో చివరి బీజం హ్రీం.  రెండవదైన కామరాజ ఖండములోని ఆరు బీజాలలో చివరి బీజం హ్రీం. మూడవదైన శక్తి ఖండములోని నాలుగు బీజాలలో చివరి బీజం హ్రీం.అక్షరానికి 20 నామాల చొప్పున పంచదశి మంత్రంలోని 15 అక్షరాలకు మొత్తం 300 నామాలు చెప్పబడినవి. అవే లలితా త్రిశతి.  

త్రిశతి నామాలకి పంచదశి మహా మంత్రానికి (శ్రీవిద్య) అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశి మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడుచుటకు అందరి హృదయాలలో ఆకాశదీపశిఖవలె విరాజిల్లుటకు పరాశక్తి బ్రహ్మ స్వరూపిణిహ్రీం బీజం ఎంతో అవసరం.

మంత్ర శాస్త్రంలో స్త్రీ దేవతలను గురించే చెప్పే మంత్రాలను విద్య అంటారు. పరమేశ్వరిని గురించి చెప్పే విద్య కాబట్టి దీనిని శ్రీవిద్య అంటారు. పరదేవతను గురించి చెప్పే మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాన్నే శ్రీవిద్య అంటారు. లలితా సహస్రం యంత్ర మంత్ర తంత్రాలే కాకుండా అనేక రహస్య విషయాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి.

శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని నామాలను ఒక సమూహంగా చెప్పటం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశేషత ఉంది. ఈ ప్రకారంగా వేయి నామాలలో అనేకానేక విశేషాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఐదు నామాలలో పరమేశ్వరి ప్రాదుర్భావాన్ని వివరిస్తే.. ఆ తదుపరి ఆ తల్లి స్వరూపాన్ని.. మరో చోట జగన్మాత సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మహా మంత్రం. ఇంకోచోట శ్రీ చక్రాన్ని వివరించారు. 

మరి కొన్ని నామాలలో ఆ పరదేవత యొక్క అర్చనా విధానాలను, ఆచారాలను, చతుషష్టిపూజా విశేషాలను, షట్చక్రాలను వివరించారు. అవస్థా పంచకము, చంద్ర విద్య, భానువిద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయనీ విద్య, వాగ్వాదినీ విద్య, శివదూతి విద్య, గాయత్రీ మంత్రం, ఆత్మ విద్య... ఈ విధంగా అనేకానేక అంశాలను లలితా సహస్రంలో పొందుపరచబడినవి. ఒక్క లలితా సహస్రాన్ని పూర్తిగా పరిశీలిస్తే శ్రీ విద్య తెలుస్తుంది. అందుకే లలితా సహస్రము శ్రీ విద్యకు సారధి వంటిది.

1 నుండి 10 అక్షరములు గల మంత్రాలను బీజ మంత్రాలు అంటారు. 11 నుంచి 21 వరకు అక్షరాలు గల వాటిని మంత్రములుగా వ్యవహరిస్తారు. 21 మించి అక్షరములు గల వాటిని మాలా మంత్రాలు అంటారు. ఖడ్గములు అంటే స్తుతి వచనాలు అని అర్థం. 

అందుకే 21 మించిన అక్షరాలు ఉన్నందునే ఖడ్గమాలగా వ్యవహరిస్తాం. లలితా త్రిశతిలో మూడవ హ్రీం కారాన్ని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరి హ్రీంకారకోశాసిలతా అని స్తుతించబడింది. అసి అంటే ఖడ్గము. అసిలతా అంటే ఖడ్గధారి. హ్రీంకారమనే కోశానికి పరమేశ్వరి ఖడ్గధారి . హ్రీంకారమనే కోశంలోనే ఆమె ఖడ్గము (కత్తి). తన భక్తులకు కలిగే రాగ ద్వేషాలను, అరిషడ్వర్గ వైరులను, బాధలను, దుఃఖాలను పరమేశ్వరి తన ఖడ్గంతో చేదిస్తుంది, తొలగిస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీ దేవి ఖడ్గమాలతో స్తుతిస్తాము. 

ముఖ్యంగా హ్రీంకార యజ్ఞం చేసే సమయంలో శ్రీ చక్రంలోని తొమ్మిది ఆవరణలను, ఒక్కో ఆవరణ అధిష్టాన దేవతలను, ఒక్కో ఆవరణలో ఉండే దేవతలను, ఆవరణ ముద్రను, ఆవరణ దేవతల రుద్ర గాయత్రిని రేపటి నుంచి రోజుకో అంశంగా తెలియచేస్తాను. భక్తి పరులు ఆకళింపు చేసుకుని జూన్ 10 మంగళవారం హైదరాబాద్ లో జరిగే హ్రీంకార మహా యజ్ఞంలో పాల్గొనటానికి, రేపటి నుంచి తెలియచేసే వివరాలు ముద్రలు మార్గదర్శిగా ఉండగలవని ఆశిస్తున్నాను. 

హ్రీంకార యజ్ఞంలో పాల్గొనేవారికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. షుమారు 4 గంటలు సమయం పట్టును. ఆనాడు ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం జరుగును. వేదిక త్వరలో తెలియచేయబడును. మీ బంధు మిత్రాదులందరికీ కార్యక్రమ వివరాలను, హ్రీంకార యజ్ఞ విశేష వివరాలను తెలియచేయగలరని మనసారా ఆశిస్తున్నాను. తిరిగి రేపటి రోజున మొదటి ఆవరణంగా ఉండే త్రిలోక్య మోహన చక్ర వివరాలను తెలుసుకుందాం. 
                                                                                శ్రీనివాస గార్గేయ

Viewing all articles
Browse latest Browse all 286

Trending Articles