Quantcast
Channel: గ్రహభూమి
Viewing all articles
Browse latest Browse all 286

72 నిముషాల సంపూర్ణ చంద్రగ్రహణ బింబం ఆశావాదానికి బాసట అవుతుందా?

$
0
0
ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది పలు మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. ఈ రోజున అందరూ ఏదో ఒక విషయంలో గానీ, అనేక విషయాలలో అసంతృప్తిని పొందుతూ, మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. ఈ మానసిక రుగ్మతలను ఆధునిక శాస్త్రజ్ఞులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. వీటన్నింటిలో అతి ముఖ్యమైన క్లిష్టమైన మానసిక రుగ్మత పేరే"యునిపోలార్ డిప్రెషన్". దీనినే ఎండోజీనియస్ డిప్రెషన్ అని కూడా అంటారు. భవిష్యకాలంలో దీని ప్రభావం ప్రజలందరి మీదా చాలా అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

అందరికీ జీవితం అంటే మహా తీపి. సుఖ సంతోషాలతో వీలైనంత ఎక్కువకాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ ఎన్నో నిరాశలు, మానసిక వ్యధలు, ఊహకందని పరిణామాలు, పరిస్థితులు తలెత్తటం, తద్వారా భయము, ఆందోళన పెరగటం.... దీనితో మానసిక వత్తిడి అధికం కావటం ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశం. చాలా మంది తమకు జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఏ విషయం కూడా సమయానికి గుర్తురావటం లేదని క్రుంగిపోతుంటారు. మరికొంత మంది తలచిన పనులు వ్యతిరేకంగా ఉంటున్నాయని, అనుకూల వాతావరణం కనుచూపు మేరలో కనపడటం లేదని భావిస్తుంటారు.

కాల గమనంలో అందరిలో అనేక గుర్తులు మరుగున పడిపోతున్నాయి. ఒక్కోసారి శాశ్వతంగా మాసిపోతుంటాయి. పాత అనుభవాలను ఎప్పుడైనా గుర్తు చేసుకొని సంతోషిద్దాం అనుకుంటే, అలాంటి సమయాలలో కూడా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.

నిత్య జీవితంలో రకరకాల పనులతో వత్తిడి, ఆందోళనలు అధికమై మానసికంగా క్రుంగి, జీవితంలో కష్టాలను, నష్టాలను, బాధలను, చిరాకులను అనుభవించే వారు ఎందరెందరో. నేర్పు, ఓర్పు, నిర్దుష్ట ప్రణాళిక, వ్యూహాత్మక పధకం మొదలైనవి.... మనిషి అలవాటు చేసుకొన్నప్పుడే, జీవితం ఎంతో సుసంపన్నంగా... ఆరోగ్యప్రదంగా... ఆనందంగా ఉంటుందని చెప్పటంలో సందేహం లేదు.

ఈ జీవనయానంలో మనిషి మనుగడకు మనసే ప్రధానమైనది. మనసనేది అతి క్లిష్టమైన ఓ వ్యవస్థ. ఈ మనస్సును.... ఈ మనిషి ఎప్పుడైతే నియంత్రించగలుగుతాడో, అప్పుడు సాధించలేనిదంటూ ఏదీ లేదు. మనస్సును ప్రశాంతంగా, తేలికగా ఉంచుకుంటూ, తాత్కాలిక మానసిక వత్తిడిని తగ్గించుకున్నప్పటికీ, వ్యక్తిత్వ వికాసానికి, మానసిక బలహీనతల నుండి శాశ్వత విముక్తిని సాధించటానికి ప్రతి వారికి... ఓ అవగాహన, సంసిద్ధత, పట్టుదల, కృషి ఎంతో అవసరం.

జ్యోతిషశాస్త్రంలో మనస్సుకు కారకత్వం వహించే గ్రహం చంద్రుడు. ఈ చంద్రుడు చంచలత్వంతో ఉంటాడు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలోకి వెళ్లి, విశేష స్థితులను అనుభవించినట్లుగా భ్రమపడి, ఓ మానసిక ఆనందాన్ని కొద్దిసేపు పొందవచ్చునేమో... కానీ వాస్తవ జగత్తులోనికి వచ్చినప్పుడు సమస్యలు, మానసిక వత్తిడి ఆందోళన అధికం కావటం, వాటి వలన శక్తి హీనులు కావటం, అనారోగ్యాన్ని ఆహ్వానించటం, వెంటవెంటనే తెలియకుండానే జరిగిపోతాయి.

మనలోని ఆలోచనలు ఎల్లప్పుడూ ఒకలా ఉండవు. కాసేపు ఆశావాదం వైపు పయనిస్తాయి. మరికొంతసేపు నిరాశావాదం వైపు ఆలోచనలు ప్రయాణం చేస్తాయి. ఏకకాలంలో ఈ రెండు రకాలైన ధోరణులు మన ఆలోచనలను ప్రభావితం చేయలేవు. ఈ రెండు ధోరణులలో ఒకటి మాత్రమే మనస్సులో మిగిలి ఉంటుంది. ఒకవేళ ఆశావాదం మిగిలింది అనుకుంటే... పిరికితనం లేకుండా, ధైర్యంగా వ్యవహరిస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ, సరికొత్త పధకాలను రూపొందించుకుంటూ, వైఫల్యాలను తట్టుకొని వాటిని అధిగమించే రీతిలో ముందుకు వెళ్ళటంతో అద్భుతమైన మానసిక శక్తి... చక్కని ఆరోగ్యం కల్గి, అనేక అంశాలలో విజయం సాధిస్తూ ఉంటుంటారు.

అలా కాకుండా ఈ మనస్సు నిరాశావాదం వైపు లాగితే... విచారము, భయము, ఆందోళన, నిరుత్సాహము, ఏదో తెలియని అనిశ్చితి, కాలు కదపకుండా అడ్డు తగిలే ఎన్నో వైఫల్యాలు మనోఫలకం మీద చిత్రీకరించబడుతుంటాయి. ఇట్టి నిరాశ, నిస్పృహలతో నడుస్తూ... నిర్ణీత కాలంలో కార్యాచరణ పధకాలను రూపుదిద్దుకోలేక అపజయాల నిచ్చెన పైన ఊగిసలాడుతూ ఉంటుంటారు.

ఈ ఆశావాదం, నిరాశావాదం మధ్యన మిగిలే సగటు మనిషి జీవితం కేవలం గ్రహసంచార స్థితిగతుల వలనే వస్తున్నాయా ? సూర్య చంద్ర గ్రహణాల ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నడా అని ఆలోచించి విశ్లేషిస్తే... కేవలం గ్రహ సంచారాలు మరియు గ్రహణాల ప్రభావాలే జీవకోటిని అట్టి స్థితిలోకి తీసుకువస్తున్నాయి అనేది నగ్న సత్యం. మరి మనః కారకుడైన చంద్రుడికి ఏప్రిల్ 4 నాటి సంపూర్ణ చంద్రగ్రహణ స్థితిలో... 5 నిముషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబము ఏర్పడగా, రాబోయే భాద్రపద పూర్ణిమకు (2015 సెప్టెంబర్ 28) సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణ బింబము ఇప్పటికంటే 15 రెట్లు అధికంగా అనగా 72 నిముషాల పాటు మసక బారిన గ్రహణ బింబము దర్శనమిస్తుంది.


అత్యంత అరుదుగా వస్తున్న ఈ మన్మధ నామ సంవత్సర గ్రహ స్థితులను తట్టుకొని ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడే సగటు మనుషులకు పూర్తి స్థాయిలో ఊరటనొందే విధంగానే కాకుండా వాస్తవ జగత్తులో కూడా ఓ సరియైన, సముచితమైన, సహేతుకమైన, సదాచార, సంస్కృతి సంప్రదాయాన్ని సావధానంగా, సద్బుధ్ధితో, సత్ప్రవర్తనతో, సద్భావనతో సంస్కరించే సరళమైన పరిహార క్రమాన్ని సర్వులూ ఆచరిస్తుంటే... ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో నిలకడగా ఉంటూ, విజయబావుటాను ఎగరవేయగలడు. ముఖ్యంగా దీనికి కావాల్సింది విశ్వాసంతో కూడిన భక్తి, భక్తితో కూడిన శ్రద్ధ, శ్రద్ధతో కూడిన ఆచరణ అవసరం. ఇలాంటివి అన్నీ మీ సొంతం చేసుకోవాలి అంటే.... నేను చెప్పే ప్రతి విషయాలను సావధానంగా ఆకళింపు చేసుకోండి.

 సర్వేజనా సుఖినోభవంతు..... సమస్త సన్మంగళాని భవంతు

Viewing all articles
Browse latest Browse all 286

Trending Articles